తంత్రాలు తరించి ప్రజాతంత్రం ప్రభవించిన,
యుగాలు మారిన తరాలు తరలిన,
మరలని మలినం మా ఈ జీవితం
తర్కించే తెలివిని త్వజించాం
మదించే ఆశలను మోహించాం
మేము జనం, మేము ఘనం, మేము మారం
విరించి తలంచినదో, నేతలు మలంచినదో
కాదు మా ఈ గమనమేరగని జీవన ఝరి
శ్రమను విస్మయించి, ఆశ్రమాలను ఆశ్రయించిన
మేము జనం, మేము ఘనం, మేము మారం
సినిమాకు అయితే బారులు తీస్తాం
హక్కులకు అయితే బందులు చేస్తాం
భద్యతలకు మాత్రం బేరాలడుతాం
మేము జనం, మేము ఘనం, మేము మారం
పని చేసేందుకు వందడిగితే వాదిస్తాం
తప్పు కాసేందుకు వందడిగితే హర్షిస్తాం
పుచ్చుకునే ప్రతివాడికిచ్చేది మేమే
మేము జనం, మేము ఘనం, మేము మారం
కలుపు తీస్తాం, వ్యవసాయం చేస్తాం,
అవినీతి తాట తీస్తాం అంటే ఈలలేస్తాం
మమ్మల్నే మారమంటే బేండు తీస్తాం
మేము జనం, మేము ఘనం, మేము మారం
ముందు నడిచే ప్రతి వాడి వెంట నడుస్తాం
విప్లవమంటే రక్తముడికిస్తాం
దానికి ఇందనం మా రక్తమంటే, రేపు కలుస్తాం
మేము జనం, మేము ఘనం, మేము మారం